ఖమ్మం జిల్లా కల్లూరులో రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుండగా, ఎర్రబోయినపల్లికి చెందిన ఆరేళ్ల బాలుడు తన తండ్రితో కలిసి మంత్రి వద్దకు వచ్చాడు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలంటూ మంత్రికి వినతిపత్రం అందించాడు.
ఎర్రబోయినపల్లి గ్రామం లింగాల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నూరు నుంచి లింగాల వరకు బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ, ఎర్రబోయినపల్లికి మాత్రం లేదు. దీంతో స్థానిక ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరి నుంచి రూ. 50 వసూలు చేస్తుండటంతో విద్యార్థులు, గ్రామస్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను బాలుడు మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు.
బాలుడి చొరవకు ముగ్ధులైన మంత్రి పొంగులేటి, వేదికపై నుంచే ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల్లోగా ఎర్రబోయినపల్లి మీదుగా బస్సు సర్వీసును నడపాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హామీతో బాలుడితో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








