కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో భాగంగా సోమవారం 19 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రి పదవులు దక్కని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్త మంత్రులతో సమావేశమైన డీకే శివకుమార్, రాజీనామాలు చేసే ఎమ్మెల్యేల లేఖలను నిమిషాల్లోనే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. అయితే, రాజీనామాను ఆమోదించే ముందు సదరు ఎమ్మెల్యేతో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు.

గతంలో ధరంసింగ్, సిద్ధరామయ్య హయాంలో తనకు కూడా మంత్రి పదవులు దక్కలేదని, అయినప్పటికీ తాను పార్టీని వీడలేదని డీకే గుర్తుచేశారు. వీరేంద్ర పాటిల్ హయాంలో బంగారప్ప, ధరంసింగ్, ఖర్గే వంటి నేతలకు కూడా అవకాశాలు రాలేదని, ఓపికతో ఉన్నవారే భవిష్యత్తులో మంచి స్థానాలకు చేరుకున్నారని ఆయన వివరించారు. పార్టీ ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని, అసంతృప్తితో ఉన్న నేతలు ఓపిక వహించాలని సూచించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని బోర్డులు, కార్పొరేషన్లలో కొత్త నియామకాలు చేపడతామని, అందులో పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే ఎస్సార్ శ్రీనివాస్ కర్ణాటక ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు, విజయనగర ఎమ్మెల్యే ఎం. కృష్ణప్పకు మంత్రి పదవి ఇవ్వలేదని నిరసిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు సామూహిక రాజీనామా లేఖను పార్టీ చీఫ్ బీకే హరిప్రసాద్‌కు పంపారు. కృష్ణప్పను బుజ్జగించేందుకు మంత్రులు చెలువరాయస్వామి, బాలకృష్ణ ఆయన ఇంటికి వెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే, రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ, డీకే శివకుమార్‌తో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

మహిళా కోటాలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండటంతో ఆ స్థానం కోసం లాబీయింగ్ మొదలైంది. సందూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ తుకారాం తన తండ్రితో కలిసి సీఎంను కలిశారు. మరోవైపు, బుధవారం నుంచే కరువు ప్రభావిత జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కొత్త మంత్రులను డీకే శివకుమార్ ఆదేశించారు.