మణుగూరు పీకే వోసీ-2 డీప్ సైడ్ బ్లాక్‌ను తిరిగి సింగరేణికి దక్కించుకోవడంలో ఏఐటీయూసీ, సీపీఐ పోరాటాలు కీలక పాత్ర పోషించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మఖ్ధూమ్ భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రక్రియలో చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మణుగూరు డీప్ బ్లాక్‌ను మొదట జెన్‌కోకు ఇచ్చి, ఆ తర్వాత ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు కుట్రలు జరిగాయని కూనంనేని ఆరోపించారు. వీటిని అడ్డుకునేందుకు ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు. ఈ పోరాటాల ఫలితంగానే బ్లాక్ సింగరేణికి దక్కిందని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 40 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ నెల 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.