మంగళవారం పార్లమెంట్ 12వ రోజు సమావేశాలు మొదలవ్వడానికి ముందు, మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని, అయోధ్య రామ మందిర చందాల చోరీని ప్రధాన అంశాలుగా తీసుకుని వారు ఆందోళన చేశారు.

ఈ నిరసనలో ప్రియాంక గాంధీ, సమాజ్ వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్, టీఎంసీ నుంచి సాగరిక ఘోష్, ఆర్జేడీ నేతలు సంజయ్ యాదవ్, మనోజ్ ఝా, ఆర్ ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. అమిత్ షా పార్లమెంట్ నుంచి ఎందుకు గైర్హాజరయ్యారని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పెద్ద ప్లెక్సీని ప్రదర్శించారు.

సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు మెడలో కండువాలు ధరించి, రాముడి హుండీని పట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. డీఎంకే ఎంపీలు మకర ద్వారం ప్రధాన మార్గంలో నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'చందా చోర్-గద్ది చోడ్', 'రాముడి చందా బీజేపీకి చేరింది' అంటూ బీజేపీని ఉద్దేశించి వారు నినాదాలు చేశారు.

నిరసనలో భాగంగా రాముడి హుండీ పేరుతో ఉన్న బాక్సులో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఇతర ఎంపీలు డబ్బులు వేసి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళనను కొనసాగించారు.