కడప జిల్లా సిద్దవటం మండలం చలమారెడ్డిపల్లెలోని దండోరా కాలనీలో ఈ దారుణం జరిగింది. పెయింటింగ్ మేస్త్రీగా పనిచేసే చెవిటివాండ్ల బాబు, తన కూతురు హారికకు వివాహితుడితో సంబంధం ఉందనే అనుమానంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. కూతురు బయటకు వెళ్లకుండా తన తల్లి ఓబులమ్మను కాపలా ఉంచాడు.
జులై 31న ఓబులమ్మ పెన్షన్ డబ్బుల కోసం మైదుకూరు మండలానికి వెళ్లిన సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న హారికపై బాబు దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత నేరుగా ఓబులమ్మ వద్దకు వెళ్లి, ఆమెను కూడా గొంతు నులిమి చంపేశాడు.
ఈ వరుస హత్యల అనంతరం బాబు పొన్నవోలుకు వెళ్లి, తన తమ్ముడి భార్యను కూడా చంపడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై ఆమెను కాపాడారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.








