ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ ఖాతాదారులకు యూపీఐ (UPI) ద్వారా పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో వివిధ టెక్ కంపెనీలతో కలిసి ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ టెస్టింగ్ దశలో ఉందని, వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.

ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతాను యూపీఐతో అనుసంధానం చేసుకోవచ్చు. దీని ద్వారా యూపీఐ యాప్‌లోనే బ్యాలెన్స్ చూసుకోవడంతో పాటు, యూపీఐ పిన్ ఎంటర్ చేసి సెకన్ల వ్యవధిలోనే నగదును తమ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా, వేగంగా పీఎఫ్ నగదును ఉపసంహరించుకునే అవకాశం కలుగుతుంది.

యూపీఐతో పాటు ఏటీఎం (ATM) ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన పీఎఫ్ ఏటీఎం కార్డులను జారీ చేయాలని సంస్థ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి సమీపంలోని ఏటీఎంల ద్వారా డబ్బులు తీసుకోవచ్చు.

ఇప్పటికే ఈపీఎఫ్ఓ క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆటో సెటిల్మెంట్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టిన 24 నుంచి 48 గంటల్లోనే డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి. భవిష్యత్తులో యూపీఐ, ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తే, చందాదారులు రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లోనే నగదును పొందే వీలుంటుంది.