భారతదేశంలో ఏటా సుమారు 50,000 మంది పాముకాటు వల్ల మరణిస్తున్నారు. ఇప్పటివరకు వాడుతున్న పాతకాలపు యాంటీవెనమ్ (పాము విషాన్ని విరిచే మందు) తయారీకి గుర్రాలు, గొర్రెలు వంటి జంతువుల రక్తంపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పద్ధతిలో నాణ్యత తగ్గడం, తీవ్రమైన దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కలగడం, ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి.
ఈ ఇబ్బందులను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో బ్యాక్టీరియా సాయంతో 'రీకాంబినెంట్ నానోబోడీ' ఆధారిత యాంటీవెనమ్‌ను రూపొందించారు. నానోబోడీలు అంటే యాంటీబాడీల చివర ఉండే అతి చిన్న ప్రొటీన్ ముక్కలు, ఇవి విషాన్ని నేరుగా పట్టుకుని నిర్వీర్యం చేస్తాయి. ఈ పరిశోధన వివరాలను 'సైన్స్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్' అనే శాస్త్రీయ జర్నల్‌లో ప్రచురించారు.
పరిశోధకులు ఐదు రకాల నానోబోడీల మిశ్రమాన్ని తయారు చేసి, మన దేశంలోని తాచుపాము, చంద్రనాగు వంటి పాముల విషంపై పరీక్షించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ మిశ్రమం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. విషం ఎక్కించిన 30 నిమిషాల తర్వాత ఈ మందును ఇచ్చినప్పటికీ, పక్షవాతం బారిన పడిన ఎలుకలు సైతం ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నాయని IISc అసోసియేట్ ప్రొఫెసర్ కార్తీక్ తెలిపారు.
సాంప్రదాయ పద్ధతిలో జంతువులను పదేపదే ఇమ్యునైజ్ (వ్యాధి నిరోధకత పెంచడం) చేయాల్సి వచ్చేది, కానీ ఈ కొత్త పద్ధతిలో ఆ అవసరం ఉండదు. తక్కువ మోతాదులోనే విషాన్ని అడ్డుకోగలగడం ఈ మందు ప్రత్యేకత. భవిష్యత్తులో ఈ సాంకేతికతను భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం ద్వారా పాముకాటు మరణాలను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.








