ఉత్తర తెలంగాణలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన జాతీయ రహదారి-563 విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కరీంనగర్ నుంచి హనుమకొండ సమీపంలోని పలవెల్పుల వరకు 68.015 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు. ప్రాజెక్టు పూర్తికి ముందుగా శనివారం అధికారులు సన్నాహక పరీక్ష నిర్వహించనున్నారు.

గతంలో ఈ మార్గం రెండు వరుసలకే పరిమితం కావడంతో భారీ వాహనాల రాకపోకల సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఫోర్ వే అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాల వరకు తగ్గుతుందని అంచనా. మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి ప్రాంతాల వారికి ఈ రహదారి ప్రధాన అనుసంధాన మార్గంగా మారనుంది.

ప్రయాణికుల భద్రత కోసం ఈ రహదారిపై అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS)ను ఏర్పాటు చేశారు. ఇది రహదారిపై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించే ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక 360 డిగ్రీల కెమెరాను అమర్చి, కేంద్ర నిఘా కేంద్రం ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని అధికారులు గమనించనున్నారు.

ప్రమాదాలు జరిగినప్పుడు లేదా వాహనాలు నిలిచిపోయినప్పుడు వెంటనే గుర్తించేలా డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 1033 హెల్ప్‌లైన్ నంబరుతో పాటు రూట్ పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సులు, క్రేన్లను అందుబాటులో ఉంచనున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా 25 చోట్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి నీటి ట్యాంకర్ల ద్వారా సంరక్షిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా 9 భారీ వంతెనలు, 23 చిన్న వంతెనలు, 5 బైపాస్‌లు, 25 అండర్‌పాస్‌లతో పాటు ఒక ఆర్వోబీ, ఒక ఆర్‌యూబీని నిర్మించారు. మానకొండూరు బైపాస్ వద్ద నిర్మించిన 560 మీటర్ల పొడవైన వంతెన ఈ రహదారిలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమను, హనుమకొండలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును అనుసంధానించడం ద్వారా పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఈ మార్గం ఊతం ఇవ్వనుంది.

వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు కూడా ఈ రహదారి ఉపయోగపడనుంది. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఉత్తర తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఇది కీలక కారిడార్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. పనులు పూర్తిగా ముగిసి రహదారి అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత రవాణా ముఖచిత్రం మారనుంది.