తిరుచిరాపల్లి జిల్లా తురైయూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, తమిళనాడు డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ తనపై దాడి చేశారని కార్తీక్ కుమార్ అనే వ్యక్తి ఆరోపించారు. తమ ప్రాంతంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడం, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు.
దీపావళి రోజున మనచ్చనల్లూరు ప్రాంతంలో ఎమ్మెల్యే రవిశంకర్ ఎదురుపడటంతో కార్తీక్ కుమార్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యే తనతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషించి కాలితో తన్ని తరిమేశారని బాధితుడు ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి విజయ్ పార్టీకి ఓటు వేసినప్పటికీ, ఎమ్మెల్యే నుంచి ఇలాంటి అనుభవం ఎదురైందని ఆయన వాపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. అందులో ఒక వ్యక్తిని మరొకరు కాలితో తన్నుతూ తరిమేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే, వీడియో చీకటిగా ఉండటంతో అందులో ఉన్న వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు.
ఈ ఘటన తర్వాత కార్తీక్ కుమార్ మనచ్చనల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే రవిశంకర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ఘటనపై అధికారిక విచారణ వివరాలు, ఎమ్మెల్యే నుంచి వివరణ వెలువడాల్సి ఉంది.
మరోవైపు, ఈ ఆరోపణలు నిజమని తేలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీవీకే పార్టీ కేడర్ కోరినట్లు సమాచారం. ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తిపై దాడి జరిగిందన్న ఆరోపణలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.








