ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేసిన ఘటనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. భద్రతా కారణాలతో రవాణాను నియంత్రించవచ్చు కానీ, మొత్తం వ్యవస్థను ఆపేయడం సరికాదని ఆయన నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో అధికారుల చర్యలను విమర్శిస్తూ, ఒక చిన్న ఈగను చంపడానికి ఎవరూ సుత్తిని వాడరని ఆయన చురకలంటించారు.

ఈ వ్యాఖ్యను ప్రాతిపదికగా తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో 'మక్కీ జనతా పార్టీ' అనే పేరుతో ఒక వ్యంగ్య ఖాతా పుట్టుకొచ్చింది. ఈగను చంపడానికి సుత్తి వాడకూడదని స్వయంగా సీజేఐ అన్నప్పుడు, తామేమీ తక్కువ కాదని ఈగ కూడా గర్వంగా చెబుతోందని ఈ ఖాతాలో హిందీలో పోస్టు చేశారు. ఆర్యన్ అనే విద్యార్థి ఈ పేజీని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

ఈ పేజీకి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం 72 గంటల వ్యవధిలోనే ఈ ఖాతాకు 40 లక్షలకు పైగా వ్యూస్, 3.3 లక్షలకు పైగా ఫాలోవర్లు వచ్చారు. అంతేకాదు, తమ పార్టీకి అధికార ప్రతినిధులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా వీరు ప్రకటనలు కూడా ఇస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ వివరాల ప్రకారం, ఈ పేజీ జూన్ 2021లోనే ప్రారంభమైంది. అయితే, గతంలో సుమారు ఎనిమిది సార్లు పేరు మార్చుకుని, చివరకు 'makhijantaparty'గా స్థిరపడింది. గతంలో కూడా ఇలాగే సీజేఐ వ్యాఖ్యల నుంచి 'కాక్రోచ్ జనతా పార్టీ' పుట్టుకొచ్చి ప్రజా ఉద్యమంగా మారిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే బాటలో మక్కీ జనతా పార్టీ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యంగ్య ఉద్యమం భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.