సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో పర్యటించిన ఆయన, గతంలో వేలంలో పాల్గొనకపోవడం వల్లే రెండు బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం అయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థ వేలం పాటల్లో పాల్గొనేలా అనుమతులు కల్పించామని ఆయన వివరించారు.

గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను తమ ప్రభుత్వం సమన్వయంతో పరిష్కరిస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తాటిచెర్ల బ్లాక్ విషయంలో బిఆర్ఎస్, బిజెపిలు ఇప్పుడు నకిలీ ప్రేమను ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు. పదేళ్ల క్రితం ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు లేకపోవడం వల్లే బొగ్గు కొరత ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రాబోయే 20 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ లక్ష్యంతోనే క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.