రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న గుంటూరు ప్రాంతమే రాజధాని అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో రాజధాని ఎక్కడ కట్టాలో గందరగోళం ఉన్న సమయంలో, శివరామకృష్ణ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన గుర్తుచేశారు.

విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ప్రాంతాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వడం గొప్ప స్ఫూర్తి అని చంద్రబాబు కొనియాడారు. తాను హైటెక్ సిటీని నిర్మించినప్పుడు ఎగతాళి చేసిన వారే, సైబరాబాద్ నగరం చూశాక రైతుల్లో నమ్మకం పెరిగి భూములు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. రైతులు లేకపోతే రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

అమరావతి నిర్మాణానికి ముందు తాను సింగపూర్ వెళ్లానని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని చంద్రబాబు తెలిపారు. ఐకానిక్ బిల్డింగ్స్, అసెంబ్లీ భవనాలకు సింగపూర్ డిజైన్లు ఇచ్చిందని ఆయన చెప్పారు. పురాణాల్లో అమరావతిని దేవతల రాజధానిగా పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు.

గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిందని చంద్రబాబు విమర్శించారు. తాను షో చేస్తున్నానని విమర్శించిన వారికి, అమరావతి నిర్మాణం గ్రేట్ విజన్ కు మొదటి విజయమని ఆయన సమాధానమిచ్చారు.