తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి, కులమతాలకు అతీతంగా ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించడం తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. పేద కుటుంబాల పిల్లలను శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు మరియు నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా ఈ పాఠశాలలు పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విద్యా సంస్థలు కేవలం చదువు చెప్పే కేంద్రాలుగానే కాకుండా, తరతరాల భవిష్యత్తును మార్చే దిశగా పనిచేస్తాయని సీఎం పేర్కొన్నారు. పేద పిల్లల కలలకు చిరునామాగా, తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.








