లాహోర్‌లోని తన నివాసంలో ఉన్న అలీమా ఖాన్‌ను స్థానిక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమెను లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించారు. ఆమెతో పాటు కారును, డ్రైవర్‌ను మజాంగ్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.

అలీమా ఖాన్‌ను సెక్షన్ 3, ఎంపీఓ (MPO) కింద పోలీసులు అరెస్టు చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. అయితే, ఆమెను అరెస్టు చేయడానికి గల అసలైన కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

ఆమె సోదరుడు, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. 2022 నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు జైలులో సరైన చికిత్స అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్‌ను జైలు అధికారులు ఒక రోజు ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో అలీమా ఖాన్ తన సోదరుణ్ణి కలిశారు. ఈ భేటీ జరిగిన కొద్ది రోజులకే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం గమనార్హం.

మరోవైపు, రావల్పిండి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) వైద్య బృందం ఇటీవల పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.