గత రెండేళ్లుగా తాను ఎదుర్కొన్న బ్రేకప్, ఆ సమయంలో పడిన బాధ గురించి అనుపమ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. భాగస్వామి తనను మానసికంగా, భావోద్వేగపరంగా వేధించే నార్సిసిస్టిక్ అబ్యూజ్ అనే పరిస్థితిని అనుభవించానని ఆమె తెలిపారు. తనలో వచ్చిన మార్పును కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుగానే గమనించారని ఆమె పేర్కొన్నారు.
రిలేషన్ మొదలైన మూడు నెలల్లోనే తన మాజీ ప్రియుడు నిశ్చితార్థం గురించి చర్చలు జరిపారని అనుపమ చెప్పారు. అయితే తనకు మరికొంత సమయం కావాలని తాను కోరానని, ఒకవేళ అప్పుడు నిశ్చితార్థానికి అంగీకరించి ఉంటే ఆ వివాహం విడాకులతో ముగిసేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయం తీసుకున్నది తానేనని ఆమె స్పష్టం చేశారు.
తన మాజీ ప్రియుడి ప్రవర్తనను ‘అన్నియన్’ సినిమాలోని పాత్రతో ఆమె పోల్చారు. ఒక రోజు ఎంతో ప్రేమగా ఉండి, మరుసటి రోజు క్రూరంగా ప్రవర్తించి, ఆ తర్వాత మళ్లీ క్షమాపణలు కోరేవాడని ఆమె వివరించారు. ఈ వ్యక్తిగత సమస్యల వల్ల తన కెరీర్ కూడా దెబ్బతిందని, ముఖ్యంగా ‘డ్రాగన్’ సినిమా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు పలు సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
నార్సిసిస్టిక్ వ్యక్తులు తమను తాము ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు కనిపిస్తారని, కానీ వాస్తవానికి వారికి తమపై నమ్మకం ఉండదని ఆమె చెప్పారు. వారు ఎప్పుడూ గుర్తింపు కోరుకుంటూ, తమ జీవితంలోకి ఇతరులను రానివ్వరని ఆమె వివరించారు. సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను ఉద్దేశించి, తాను ఆత్మహత్య చేసుకున్నట్లు రాసి ఉంటే తనకు మరింత ప్రేమ దక్కేదేమోనని ఆమె భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.








