రేవా నియోజకవర్గ బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వ్యతిరేకించే వారిని ఉద్దేశించి వివాదాస్పదంగా మాట్లాడారు. రేవా నుంచి భోపాల్, కోల్‌కతాకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని నిర్ణయిస్తే, కొందరు దీనిపై ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేవలం స్వచ్ఛమైన పెట్రోల్ మాత్రమే కావాలని కోరుకునే వారిని ఉద్దేశించి, 'స్వచ్ఛమైన పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?' అని ప్రశ్నించారు. దేశంలో స్వచ్ఛమైన పెట్రోల్ లభ్యం కానప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందని ఆయన నిలదీశారు.
ప్రస్తుతం భారత్ తన అవసరాలకు కావాల్సిన చమురులో 20 శాతాన్ని మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేస్తోందని, మిగిలిన 80 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని మిశ్రా వివరించారు. హొర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు రవాణాకు అదనంగా 18 వేల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తోందని, ఇది కష్టతరమైన అంశమని ఆయన పేర్కొన్నారు.
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తోనే భారత్‌లో వాహనాలు నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇథనాల్ వాడకంపై ఉన్న అభ్యంతరాలను తోసిపుచ్చుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇథనాల్ మిశ్రమం అవసరమని ఆయన వాదించారు.






