ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టాలని, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఉట్నూర్ సర్పంచ్ అనిత భర్త శ్రీనివాస్ జాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయానికి వెళ్లిన బృందం మంత్రిని కలిసింది. గ్రామపంచాయతీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు.
ఈ వినతిపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఉట్నూర్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ జాదవ్ తెలిపారు.
మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు శ్రీనివాస్ జాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత ఉట్నూర్ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.








