తెలంగాణకు అదనంగా 1.21 లక్షల ఇండ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఇండ్లను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా కేంద్రం నుంచి తీసుకోలేదని మంత్రి గుర్తు చేశారు.
కేంద్రం అమలు చేస్తున్న 'హౌసింగ్ ఫర్ ఆల్' (అందరికీ ఇళ్లు) లక్ష్యంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు భారీగా ఇండ్లు దక్కాయి. 2024 తర్వాత తెలంగాణకు 79 వేల ఇండ్లు, తాజాగా అదనంగా 1.21 లక్షల ఇండ్లు కలిపి మొత్తం 2 లక్షల ఇండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఏపీకి అదనంగా 2.25 లక్షల ఇండ్లు ఇవ్వడంతో ఆ రాష్ట్రానికి మొత్తం 3 లక్షల ఇండ్లు కేటాయించినట్లయింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం 5 లక్షల ఇండ్లు ఇవ్వడం ఇదే మొదటిసారి అని మంత్రి వివరించారు.
కొత్తగా మంజూరైన ఇండ్ల కోసం భూమి ఉన్న అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం 'ఆవాస్ ప్లస్' (ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకునే మొబైల్ యాప్), జియో ట్యాగింగ్, సెల్ఫ్ సర్వే వంటి పద్ధతులను వాడుతున్నామని చెప్పారు. పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా కేవలం అర్హత ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇండ్ల కేటాయింపు కోసం గతంలో ఉన్న నిబంధనలను కూడా ప్రభుత్వం సరళీకరించింది. నెలవారీ ఆదాయ పరిమితిని రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు. అంతేకాదు, సాధారణంగా ప్రజల వద్ద ఉండే రిఫ్రిజిరేటర్, టూ వీలర్ వంటి వస్తువులను అనర్హత ప్రమాణాల జాబితా నుంచి తొలగించారు.
గతంలో వివిధ కారణాల వల్ల నిర్మాణం పూర్తి కాని ఇండ్లను కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి, అంటే పాత బకాయిలను పూర్తి చేసి, ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు ఏండ్లలో గరిష్ట స్థాయిలో ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.








