సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసానికి వెళ్లారు. అక్కడ గణపతి విగ్రహాన్ని దర్శించుకున్న ప్రధాని, హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించారు.

ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రధాని మోదీ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి.

ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. గణేశుడి కృప అందరిపై ఉండాలని, విఘ్న నివారకుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహం నిండాలని ఆయన ఆకాంక్షించారు.

గణపతి బప్పా మోరియా అంటూ ప్రధాని నినాదాలు చేశారు. గణేశుడి ఆశీస్సులతో దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని, ప్రజల ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.