ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో 118 జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) ప్రకారం 9,700 ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన మెమోను ప్రభుత్వం జారీ చేసింది. ఈ ప్లాట్లలో దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకుని ఉంటున్న యజమానులు, స్థానిక అధికారులను సంప్రదించి నిబంధనల మేరకు తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే 22ఏ (రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్) జాబితాకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవోఆర్‌టీ నంబర్ 564ను జారీ చేసినట్లు మంత్రి శాసనసభలో వెల్లడించారు. ఈ కమిటీకి సీసీఎల్‌ఏ (ప్రధాన భూ పరిపాలన కమిషనర్) డీఎస్ లోకేశ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

ఈ కమిటీలో లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో ఉండి, హెచ్‌ఎండీఎ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ), డీటీసీపీ (పట్టణ ప్రాంత ప్రణాళికా విభాగం), జీహెచ్‌ఎంసీ అనుమతులతో లేఅవుట్లు వేసిన ప్రాంతాలను 22ఏ జాబితా నుంచి తొలగించే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు సింగరేణి ప్రాంతంలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన జీవో-76 ప్రకారం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.