సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ తమపై బురద చల్లుతోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతామన్న భయంతోనే తమను సస్పెండ్ చేశారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే '22ఏ' (22A) జాబితాలో భూములను చేర్చి లక్షలాది మందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే అసెంబ్లీలో 30 లక్షల ఎకరాల భూమిని కలెక్టర్లు 22ఏ జాబితాలో పెట్టారని చెప్పారని ఆయన గుర్తు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని ఆయన మండిపడ్డారు.
తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీల బృందంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 3 వేల మంది పోలీసులు, డ్రోన్ కెమెరాల నిఘాతో కాంగ్రెస్ బృందం సిద్దిపేటపై దండయాత్ర చేసినట్లు రావడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఆహ్వానిస్తే దగ్గరుండి క్షేత్రాన్ని చూపించేవాడినని, ఈ పర్యటన కోసం భారీగా డబ్బు వృథా చేశారని ఆయన అన్నారు.
తాను రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తయ్యాకే భూమిని కొన్నానని, ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్ (ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల గురించి ఇచ్చే ప్రమాణపత్రం)లో పొందుపరిచానని హరీష్ రావు స్పష్టం చేశారు. భూమి హద్దుల కోసం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, ఏడీ సర్వేయర్‌కు దరఖాస్తు చేసి చలాన్లు కూడా కట్టానని తెలిపారు. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ బృందం తన తోటను చూడటం కంటే, రంగనాయక సాగర్‌లో నీళ్లు లేక ఎండిపోతున్న లక్షలాది ఎకరాల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై పోరాడాలని హరీష్ రావు సూచించారు. ఈ సమావేశంలో పలువురు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.







