బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. రైలులో ప్రయాణించి తెల్లవారుజామున యాద్గిర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఒంటరిగా ఉన్న ఆమెను మల్లు అలియాస్ మల్లప్ప అనే వ్యక్తి కలిశాడు.

ఆ యువతి వివరాలు తెలుసుకున్న మల్లు, సహాయం చేస్తానని నమ్మించి ఆమెను రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి ప్రతిఘటించగా, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.

మరుసటి రోజు రైల్వే పోలీస్ శరణప్ప, మరో పోలీస్ సిబ్బంది ఆ గదికి వచ్చి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తాము చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఆమెను వేర్వేరు ప్రాంతాలకు తరలించి బంధించారు.

మహేష్, ఆకాష్ అలియాస్ పప్పు, హర్ష అలియాస్ సుధాకర్ అనే ముగ్గురు యువకులు కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కొన్ని రోజుల పాటు బందీగా ఉన్న యువతి, చివరకు యాద్గిర్ మహిళా పోలీస్ స్టేషన్ అత్యవసర సహాయ నంబర్‌కు ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించింది.

సమాచారం అందుకున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించి, యువతిని బంధించిన ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆమెను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు రైల్వే పోలీసులతో సహా మొత్తం ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.