ఆగస్టు 21 నుండి ఆగస్టు 24 మధ్య మెక్సికో గల్ఫ్‌లో ఉన్న రెండు చమురు ట్యాంకర్లను ఎఫ్‌బిఐ ఏజెంట్లు, యూఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది తనిఖీ చేశారు. ఈ నౌకల నెట్‌వర్క్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయని, వాటి నావిగేషన్, ప్రొపల్షన్ (నౌకను ముందుకు నడిపే యంత్ర వ్యవస్థ) మరియు కార్గో నిర్వహణ వ్యవస్థలు ప్రభావితమయ్యాయని ఏజెన్సీలు గుర్తించాయి.

ఈ తనిఖీల్లో భాగంగా నౌక కెప్టెన్, సిబ్బంది మరియు యజమాని సంస్థ ప్రతినిధులు అధికారులకు పూర్తిగా సహకరించారు. ఈ ఘటనలో ఎటువంటి కార్యాచరణ అంతరాయాలు, నౌక అస్థిరత, సిబ్బందికి భౌతిక ప్రమాదం లేదా పర్యావరణానికి నష్టం వాటిల్లలేదని ఎఫ్‌బిఐ, కోస్ట్ గార్డ్ సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశాయి.

హ్యాకింగ్‌కు గురైన నౌకల్లో 'VL Prosperity' ఒకటిగా గుర్తించారు. 333 మీటర్ల పొడవున్న ఈ భారీ ట్యాంకర్ 2 మిలియన్ బ్యారెళ్ల కంటే ఎక్కువ చమురును మోసుకెళ్లగలదు. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం, ఆగస్టు 7న ఈజిప్ట్ నుండి అమెరికాకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌక వేగం, ఇంధన వ్యవస్థలకు అంతరాయం కలగడంతో పాటు ఒక రోజుకు పైగా కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయలేదు.

ఈ దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో ఇంకా స్పష్టత లేదు. అయితే, ఇరాన్ మద్దతు గల హ్యాకర్ల పాత్రపై అమెరికా దర్యాప్తు చేస్తోంది. గతంలో స్ట్రైకర్ (Stryker) అనే వైద్య పరికరాల తయారీ సంస్థ, లాస్ ఏంజిల్స్ ప్రజా రవాణా వ్యవస్థ మరియు అమెరికాలోని వందకు పైగా నీటి సరఫరా కేంద్రాలపై ఇరాన్ హ్యాకర్లు దాడులు చేసినట్లు సమాచారం.

ఈ దాడులు కేవలం అవకాశం దొరికినప్పుడు చేసే 'అవకాశవాద' దాడులని అమెరికా సైబర్ భద్రతా సంస్థ సిఐఎస్ఏ (CISA) పేర్కొంది. గ్లోబల్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లను హ్యాకర్లు ఎలా లక్ష్యంగా చేసుకుంటున్నారో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ ట్యాంకర్ మెక్సికో గల్ఫ్‌లోనే ఉంది.