ఢిల్లీ రవాణా సంస్థ (DTC)లో పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీ డ్రైవర్లు చేపట్టిన నిరవధిక సమ్మె కారణంగా గత నాలుగు రోజులుగా బస్సులు రోడ్లపైకి రావడం లేదు. వేతనాల పెంపు, వైద్య సదుపాయాలు, సామాజిక భద్రత వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ డ్రైవర్లు ఈ సమ్మె చేస్తున్నారు.
బస్సులు నిలిచిపోవడంతో రాణి ఖేరా, రాజ్‌ఘాట్, నెహ్రూ ప్లేస్, బురారీ, వజీర్‌పూర్, ఘుమన్‌హేరా, సరితా విహార్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై ఒత్తిడి పెరగడంతో, మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న 82 లక్షల 44 వేల 903 మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ఢిల్లీ మెట్రో చరిత్రలో ఒక్క రోజులో ఇంతమంది ప్రయాణించడం ఇదే మొదటిసారి.
గతంలో 2025 ఆగస్ట్ 8న రక్షా బంధన్ పండుగ రోజున 81 లక్షల 87 వేల 674 మంది ప్రయాణించగా, ఆ రికార్డును ఇప్పుడు అధిగమించింది. ప్రస్తుతం DMRC, నోయిడా-గ్రేటర్ నోయిడా కారిడార్, గురుగ్రామ్ రాపిడ్ మెట్రో లైన్‌తో కలిపి మొత్తం 303 స్టేషన్ల ద్వారా 416 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుతున్నాయి.
పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆపరేషనల్ డిమాండ్ ఆధారంగా అదనంగా ఎనిమిది రైళ్లను నడుపుతున్నట్లు ఢిల్లీ మెట్రో అధికారులు తెలిపారు.








