బిగ్ బాస్ తెలుగు 10 రెండో వారం 'పవర్ ఆఫ్ పీపుల్' అనే కొత్త విభాగంతో మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ కోసం ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాకు రావాలని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే, సమయానికి రాకుండా ఆలస్యం చేసినందుకు షాలినిని బిగ్ బాస్ హెచ్చరించారు. మరోసారి ఇలాగే ఆలస్యం చేస్తే నేరుగా నామినేషన్లలో ఉంచుతానని స్పష్టం చేశారు.
ఈ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ ఒక గేమ్ నిర్వహించారు. ఇద్దరు సభ్యులను పిలిచి, ఒక స్తంభానికి కట్టిన తాళ్లను విప్పి, అక్కడ ఉన్న గోల్డ్ లేదా సిల్వర్ గొడ్డలిని అందుకోవాలని చెప్పారు. సిల్వర్ గొడ్డలి దక్కించుకుంటే ఒకరిని, గోల్డ్ గొడ్డలి దక్కించుకుంటే ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. అలాగే, ఈ గేమ్‌లో ఓడిపోయిన వారు కూడా నామినేషన్లలోకి వస్తారని బిగ్ బాస్ నిబంధన పెట్టారు.
సుధీర్, ఝాన్సీ, దేబ్జానీ, రోహిత్, నరేష్, త్రిగున్, అమన్, వంశీలు గేమ్‌లో గెలిచి నామినేషన్లు చేశారు. సుధీర్ త్రిగున్, షాలినిలను నామినేట్ చేయగా, దేబ్జానీ త్రిగున్‌ను నామినేట్ చేశారు. రోహిత్ త్రిగున్, ఝాన్సీలను, నరేష్ షాలినిని నామినేట్ చేశారు. త్రిగున్ సుధీర్, రోహిత్‌లను, అమన్ రామ్ ప్రసాద్, ఝాన్సీలను, వంశీ దేబ్జానీ, ముకేశ్‌లను నామినేట్ చేశారు.
ఈ ప్రక్రియలో సభ్యుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. సుధీర్ అగ్నిపరీక్ష టీమ్‌కు మద్దతు ఇస్తున్నాడని త్రిగున్ అతడిని 'కట్టప్ప' అని పిలుస్తూ నామినేట్ చేశారు. దీనిపై సుధీర్, త్రిగున్ మధ్య గొడవ జరిగింది. ఝాన్సీ తనను నామినేట్ చేసిన రోహిత్, అమన్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాను ఎవరి గ్రూపులోనూ ఉండనని స్పష్టం చేశారు.
నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి షాలిని, త్రిగున్, ఝాన్సీ, ముకేశ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ నామినేషన్లలో నిలిచారు. వీరిలో త్రిగున్‌కు అత్యధిక నామినేషన్లు పడ్డాయి. ఈ 11 మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.








