ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను హైకోర్టు అనర్హుడిగా ప్రకటించడంతో, ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఖాయమైంది. ఈ విషయాన్ని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి తెలియజేసింది. ఉభయ రాష్ట్రాల చరిత్రలో పార్టీ మారిన కారణంగా అనర్హత వేటు పడ్డ తొలి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ నిలిచారు.

గతంలో కులం తప్పుగా పేర్కొనడం లేదా పార్టీ విప్‌ను ఉల్లంఘించడం వంటి కారణాలతో కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. అయితే, పార్టీ మారిన కారణంగా అనర్హతకు గురైన మొదటి వ్యక్తి దానం నాగేందరే కావడం గమనార్హం. ఈ కేసు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు, న్యాయస్థానాలకు ఒక మార్గదర్శకంగా నిలవనుంది.

గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగగా, ఇప్పుడు మూడో స్థానానికి ఉపఎన్నిక జరగబోతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తప్ప, ఇంత తక్కువ వ్యవధిలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ఎన్నికల సంఘం త్వరలోనే ఉపఎన్నిక తేదీని ప్రకటించనుంది.

రాబోయే ఉపఎన్నికను 2027 ఫిబ్రవరిలోపు జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్ 6న తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లోని ఖాళీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాతే ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్పష్టత రానుంది.

దానం నాగేందర్‌కు గతంలో ఉపఎన్నికల సెంటిమెంట్ కలిసి రాలేదు. 2004లో ఆసిఫ్‌నగర్ నుంచి గెలిచిన తర్వాత, టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఆయన, మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఇప్పుడు కూడా అదే ఫలితం పునరావృతం కావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ మళ్లీ పోటీ చేస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కుతుందా అన్నది సందేహమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి తన ప్రధాన అనుచరుడు రోహిన్‌రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.