ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, మరికొన్ని గంటల్లో తుది తీర్పును వెలువరించనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఈ కేసులో తీర్పును బుధవారం ప్రకటించనున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బీ-ఫారం (ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ ఇచ్చే అధికారిక పత్రం) తో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయడం ఈ కేసులో కీలక ఆధారమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, కే వివేక్‌రెడ్డి వాదించారు.
పార్టీ ఫిరాయింపును నిర్ణయించేటప్పుడు అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే ప్రవర్తనను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న స్పీకర్ వాదనను పిటిషనర్లు వ్యతిరేకించారు. మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన అసలు పార్టీతో ఉన్న అనుబంధాన్ని దానం వదులుకున్నారని, దీనికి వేరే ఆధారాలు అవసరం లేదని వారు కోర్టుకు తెలిపారు. స్పీకర్ అధికారాలు అపరిమితమైనవి కావని, ఆయన నిర్ణయాలు కూడా న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయని పిటిషనర్లు పేర్కొన్నారు.
మరోవైపు, దానం నాగేందర్ తరఫు న్యాయవాది ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దానం తన బీఆర్‌ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నట్టు ఎక్కడా ప్రకటించలేదని వాదించారు. అసెంబ్లీ రికార్డుల్లో ఆయన ఇప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యుడిగానే ఉన్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలతో ఫొటోలు దిగడం, కండువా కప్పుకోవడం లేదా మీడియాలో వార్తలు రావడం వంటివి పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టు నిర్ధారించలేవని దానం తరఫు న్యాయవాది వాదించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు పోటీ చేసినంత మాత్రాన అసెంబ్లీ సభ్యత్వం రద్దయినట్టు భావించకూడదని ఆయన కోర్టుకు వివరించారు.
గతంలో దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో, ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.








