మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాకా’ చిత్రంలో తన పాత్ర పేరు ‘కదిరి కాళిదాస్’ అని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వేదికపై ఉన్న యాంకర్ శ్రావంతి చొక్కరాపు స్వస్థలానికి, ఈ పాత్ర పేరుకు సంబంధం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం, ఈ సినిమాలో చిరంజీవి రెండు భిన్నమైన పార్శ్వాలున్న పాత్రను పోషిస్తున్నారు. బయటి ప్రపంచానికి ఆయన ‘సత్యం’ అనే సాధారణ ఆక్వా ఫ్యాక్టరీ సూపర్‌వైజర్‌గా కనిపిస్తారు. అయితే, ఆ అమాయకపు రూపం వెనుక అండర్‌వరల్డ్‌ను శాసించే ‘కదిరి కాళిదాస్’ అనే డాన్ ఉన్నాడనే అంశం కథలో కీలకంగా మారనుంది.

ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు తండ్రీకూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. మలయాళ నటి అనస్వర రాజన్ చిరంజీవి కూతురు ‘అమ్ములు’ పాత్రలో నటిస్తోంది. మెడిసిన్ చదివే కూతురి కోసం ప్రాణమిచ్చే తండ్రిగా చిరంజీవి నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటుందని సమాచారం.

ప్రముఖ నిర్మాణ సంస్థ KVN Productions ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నివేత పేతురాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.