బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. మంత్రులు తన ఫోన్ ఎత్తడం లేదని, కొందరు వ్యక్తుల వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని క్యాడర్‌కు వివరణ ఇచ్చారు.
కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ అభివృద్ధి జరిగిందని, అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోలేనని పోచారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అసహనం కలిగిస్తున్నాయి. తాను కాంగ్రెస్ జెండాను కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. దీంతో ఆయన మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారనే ప్రచారం మొదలైంది.
అయితే, పోచారంను తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇటీవల కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. ఇది కేసీఆర్ నిర్ణయమని కూడా సమాచారం. మరోవైపు, ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్‌ఎస్ పెద్దలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో, బాన్సువాడలో బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలని బీఆర్‌ఎస్ యోచిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పోచారం ఇప్పట్లో పార్టీ మారకపోవచ్చని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్తాననే ప్రచారాన్ని ఖండించడం లేదు. బాన్సువాడలో నెలకొన్న ఈ రాజకీయ పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి.








