బహుజన చక్రవర్తిగా పేరుగాంచిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత కథతో తెరకెక్కిన ‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమా ట్రైలర్‌ను మంగళవారం తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించగా, వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను దీపక్ న్యాతి చూస్తున్నారు.

ట్రైలర్ విడుదల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బహుజనుల రాజ్యం కోసం పోరాడిన ధీరుడి చరిత్రను వెండితెరపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ నెల 18న ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సినిమాను డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. బహుజనుల కోసం పాపన్న చేసిన పోరాటాన్ని ఈ చిత్రం ప్రతిబింబిస్తుందని, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, దీపక్ న్యాతి తదితరులు పాల్గొన్నారు.