రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘MYSAA’ సినిమా టీజర్ ఆదివారం విడుదలైంది. అన్‌ ఫార్ములా ఫిల్మ్స్‌ బ్యానర్‌పై రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ టీజర్‌లో రష్మిక గిరిజన గోండు మహిళగా అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించింది. ముఖమంతా రక్తపు మరకలతో, చేతిలో ఆయుధాలు పట్టి శత్రువులపై ఆమె విరుచుకుపడుతున్న దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో కనిపించిన రష్మిక, ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని రౌద్ర రూపంలో నటిస్తోంది.

టీజర్‌లో వినిపించిన “యుద్ధానికి ఆయుధం అంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు” అనే డైలాగ్ ప్రత్యేకంగా నిలిచింది. కళ్లలోనే పగ, ఆవేశం నింపుకుని ఆమె పలికించిన హావభావాలు నటనకు కొత్త అర్థాన్ని ఇచ్చాయి. క్లైమాక్స్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో టీజర్ హై-వోల్టేజ్ అనుభూతిని కలిగిస్తోంది.

ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం అందించారు. ప్రతి షాట్‌ను ఎలివేట్ చేస్తూ ఆయన ఇచ్చిన సంగీతం టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చిత్ర బృందం పేర్కొంది. గిరిజన సంస్కృతి, వారి పోరాటాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రష్మిక కెరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది.

ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. కమర్షియల్ అంశాలతో పాటు బలమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.