ప్రముఖ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్, పాడ్‌కాస్ట్ హోస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహా హీరోగా నటిస్తున్న ‘సంగీత్’ (Sangeet) సినిమా నుంచి ‘నీ వల్లే’ అనే మొదటి పాటను సెప్టెంబర్ 19న విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు విజేత, సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ సోషల్ మీడియా వేదికగా ఈ పాటను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ మధురమైన రొమాంటిక్ మెలోడీ పాటకు అచు రాజామణి సంగీతం అందించారు. యువతకు ఇష్టమైన గాయకుడు సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ఈ పాటను పాడగా, విక్రమ్ శివ సాహిత్యం రాశారు. ఈ పాటలో హీరో నిఖిల్, తమిళ నటి తేజు అశ్వినిల మధ్య ఉన్న ప్రేమ ప్రయాణాన్ని, వారి కెమిస్ట్రీని అందంగా చూపించారు.

ఈ సినిమాతో తేజు అశ్విని టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. చెన్నైకి చెందిన ఈమె గతంలో యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు, మోడలింగ్‌లో పనిచేసి, ‘పారిస్ జయరాజ్’, ‘ఎన్న సొల్ల పొగిరాయ్’ వంటి చిత్రాల్లో నటించింది. కెవిన్‌తో కలిసి ఆమె చేసిన ‘అస్కు మారో’ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

లహరి ఫిల్మ్స్, ఆర్‌బీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు సాద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ డ్రామా అందరినీ అలరిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మంచి స్పందనతో ట్రెండింగ్‌లో ఉంది.

ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమా టీజర్, విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.