రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం 5,742 ఎంపీటీసీ (మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు), 565 జడ్పీటీసీ (జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు) స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఈ ప్రక్రియ ఏడాదిగా నిలిచిపోయింది.
గత ఏడాది సెప్టెంబర్ 26న స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 09 జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, జీవో నెంబర్ 9తో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్టోబర్ 9న ఎన్నికల సంఘం ప్రక్రియను నిలిపివేసింది.
ఎన్నికలు జరగకపోవడంతో స్థానిక సంస్థల పాలన అధికారుల చేతుల్లోకి వెళ్ళింది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఈ నిధులు రాక కోట్లాది రూపాయల గ్రాంట్లు మురిగిపోయే ప్రమాదం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం స్థానిక సంస్థలను పర్యవేక్షిస్తున్న ప్రత్యేకాధికారులకు పనిభారం ఎక్కువగా ఉండటంతో, వారు గ్రామీణ సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, చెరువుల మరమ్మతులు వంటి అభివృద్ధి పనులు నిధులు లేక, ఆమోదాలు లభించక పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే నాయకులు లేకపోవడం వల్ల జవాబుదారీతనం లోపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికల ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేస్తారోనని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ పూర్తయితేనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికలు నిర్వహిస్తేనే పాలన గాడిలో పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.








