తెలుగు రాష్ట్రాల్లో పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు మాత్రమే కాకుండా లంచ్ బాక్స్ లేదా దేవునికి నైవేద్యంగా కూడా నిమ్మకాయ పులిహోరను ఎక్కువగా తయారు చేస్తారు. ఈ వంటకం చాలా సులభంగా, తక్కువ సమయంలోనే సిద్ధమవుతుంది. రుచికరమైన పులిహోర చేయడానికి ముందుగా పావు కిలో బియ్యాన్ని పొడిపొడిగా, మెత్తగా కాకుండా ఉడికించి, ఒక వెడల్పాటి ప్లేట్ లేదా గిన్నెలో చల్లారనివ్వాలి. అన్నం ఎంత పొడిపొడిగా ఉంటే పులిహోర అంత రుచిగా ఉంటుంది.
తర్వాత పోపు సిద్ధం చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి, రెండు చెంచాల వేరుశనగపప్పును సగం వేయించుకోవాలి. ఆ తర్వాత ఒకటిన్నర చెంచా శనగపప్పు, ఒకటిన్నర చెంచా మినప్పప్పు, అర చెంచా జీలకర్ర, అర చెంచా ఆవాలు వేసి సమానంగా వేగేలా కలపాలి. పులిహోరకు మంచి రుచి రావాలంటే పోపు దినుసులు ఎక్కువగా ఉండాలి. పోపు సగం వేగిన తర్వాత, కారానికి సరిపడా 10 పచ్చిమిర్చి ముక్కలు, 5 ఎండుమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. చివరగా కొద్దిగా పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే పోపు సిద్ధం.
ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మూడు నిమ్మకాయల రసం తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. నిమ్మరసంలోనే ఉప్పు కలపడం వల్ల అది అన్నంలో బాగా కలుస్తుంది. చల్లారిన అన్నంలో ముందుగా ఈ నిమ్మరసం మిశ్రమాన్ని, తర్వాత సిద్ధం చేసిన పోపును వేసి జాగ్రత్తగా కలపాలి. చేత్తో నెమ్మదిగా కలిపితే అన్నం విరగకుండా ఉంటుంది. కలిపిన వెంటనే పులిహోర కొద్దిగా పుల్లగా అనిపించినా, కాసేపటికి పులుపు తగ్గి రుచిగా మారుతుంది.
కారం, పులుపు ఎక్కువగా ఉంటేనే పులిహోర మరింత రుచిగా ఉంటుంది. ఇలా సిద్ధమైన నిమ్మకాయ పులిహోరను దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. దీనిని వేడివేడిగా అల్పాహారంగా, లంచ్ బాక్స్‌లో లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా ఆస్వాదించవచ్చు.






