సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే రోజున కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) 'చలో సంసద్' ర్యాలీకి పిలుపునివ్వడంతో న్యూఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఈ ర్యాలీకి తాము ఎలాంటి అనుమతి కోరలేదని, అలాగే అనుమతి ఇవ్వలేదని న్యూఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ సచిన్ శర్మ ఆదివారం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీ జిల్లా అంతటా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 163 (గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 144) కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి.

ఈ ఆంక్షల ప్రకారం, జంతర్ మంతర్‌లో ముందస్తు అనుమతి పొందిన నిరసన స్థలం మినహా, మరెక్కడా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడంపై నిషేధం ఉంది. ప్రజలు ఎవరూ ఈ ర్యాలీల్లో పాల్గొనవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని వారు కోరారు.