అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం నిర్వహించారు. పాతగుంతకల్లు ఆరో వార్డు వాల్మీకి సర్కిల్ నుంచి దోనిముక్కల రోడ్డు వరకు ఈ కార్యక్రమం సాగింది. ఇందులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమం ముగించుకుని తాగునీటి సరఫరా మెరుగుదల పథకం భూమిపూజకు ఎమ్మెల్యే తన కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో ఆరో వార్డు ప్రజలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దోనిముక్కలకు వెళ్లే ప్రధాన రహదారిపై డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోందని వారు ఫిర్యాదు చేశారు.
వర్షం పడినప్పుడు రోడ్డుపై రొచ్చు పేరుకుపోతోందని, దీనివల్ల దోమలు పెరిగి తాము అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. 'ఎమ్మెల్యే సారూ.. ఒక్కసారి కిందకు దిగి రోడ్డుపై ఉన్న మురుగును చూడండి' అని వారు వేడుకున్నా, ఆయన స్పందించకుండానే ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.
ప్రజాప్రతినిధి పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి కారు దిగి వచ్చి, డ్రెయినేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో వార్డు ప్రజలు శాంతించారు.








