అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 71,536 మంది చేనేతల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఉరవకొండలో చేనేతలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
చౌడేశ్వరి కాలనీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పార్క్ ఆంజనేయస్వామి గుడి, బళ్లారి రోడ్డు, టవర్ క్లాక్ మీదుగా కవిత హోటల్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా చేనేతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాలకు చేనేతలు పాలాభిషేకం చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలను ఆదుకున్నారని మాజీ వైస్ ఎంపీపీ పెద్దకోట్ల రాజేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్, మండల టిడిపి కన్వీనర్ మోపిడి గోవిందు, పట్టణ కన్వీనర్ రామాంజనేయులుతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. చేనేతలకు అందించిన ఈ సహాయం మరువలేనిదని, ప్రభుత్వం బీసీల పక్షపాతిగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.







