సరూర్ నగర్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు విదేశాలకు ఎందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్, ముందుగా తన కుటుంబ సభ్యులు ఎందుకు విదేశాలకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలు విదేశాల్లో చదువుకోకూడదా అని ఆయన నిలదీశారు.
కేటీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు ఆరు రాజ్యసభ పదవులు, మంత్రి పదవులు ఇచ్చారని వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు. పేదలకు మంచి జరుగుతుంటే కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం పనిచేస్తుంటే, పదవి కోల్పోయిన బాధలో కేటీఆర్ వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రజా ప్రభుత్వాన్ని దించాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు ఇచ్చిన డబ్బులతో కేసీఆర్ కుటుంబానికి రూ.1400 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేటీఆర్ సోదరి కూడా అడుగుతున్నారని ఆయన గుర్తు చేశారు.





