రాష్ట్రంలో పరిపాలనను పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో శుక్రవారం జరిగిన ‘ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కాంక్లేవ్ (తెలంగాణ)’ను ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రభుత్వ పాలనలో AI, బ్లాక్ చెయిన్, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే డిజిటల్ క్యాబినెట్, రియల్ టైమ్ గవర్నమెంట్ డ్యాష్ బోర్డు, వాట్సాప్ ద్వారా పౌర సేవలు, మీ టికెట్ వంటి సంస్కరణల ద్వారా తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.

పౌరుల డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని, త్వరలోనే బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీని అందించడం, డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్‌లెస్ అడ్మినిస్ట్రేషన్‌ను అమలు చేయడం తమ లక్ష్యమని వివరించారు.

వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ సేవలను నేరుగా వారి ఇంటి వద్దకే చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ పరదేశి, జీవీఎల్ సత్య కుమార్, డా. దేవేష్ త్యాగి, సౌరభ్ కె. తివారీ తదితరులు పాల్గొన్నారు.