కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో గిగ్ వర్కర్ల సమ్మె వాయిదా పడింది. లేబర్ డిపార్ట్‌మెంట్ కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, లేబర్ మరియు ట్రాన్స్‌పోర్ట్ ఉన్నతాధికారులు, వివిధ ట్రేడ్ యూనియన్లు, ఓలా, ఉబర్, రాపిడో, జొమాటో, స్విగ్గీ యాజమాన్యాలతో జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ చర్చల అనంతరం TADF ప్రతినిధి సలావుద్దీన్ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం నిర్ణయించే రేట్లనే అమలు చేస్తామని ఓలా, ఉబర్ యాజమాన్యాలు హామీ ఇచ్చాయని సలావుద్దీన్ తెలిపారు. వైట్ ప్లేట్ వాహనాల వినియోగంపై రవాణా శాఖ సానుకూలంగా స్పందించిందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను వారం, పది రోజుల్లో రూపొందిస్తామని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
గిగ్ వర్కర్ల చట్టానికి అవసరమైన రూల్స్, వెల్ఫేర్ బోర్డును ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. వర్కర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు. పర్ కిలోమీటర్, పర్ మినిట్ ప్రాతిపదికన బేస్ ఫేర్ నిర్ణయించాలని, గైడ్‌లైన్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని యూనియన్లు డిమాండ్ చేశాయి.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో వారం నుంచి పది రోజుల పాటు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. చర్చలకు ఆహ్వానించినందుకు మంత్రికి, కార్మిక శాఖ అధికారులకు వారు ధన్యవాదాలు తెలిపారు.







