అమెరికాలో విదేశీ ఉద్యోగుల వీసాలను చూసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఒక ఉద్యోగికి గతంలో వీసా ఆమోదం లభిస్తే, రెన్యూవల్ సమయంలో అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) ఆ పాత నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే, ఇకపై ఆ పద్ధతిని నిలిపివేయాలని DHS భావిస్తోంది.

'Removing Deference to Prior USCIS Determinations of Eligibility' పేరుతో ఈ కొత్త నిబంధనను తీసుకువస్తున్నారు. దీని ప్రకారం, గతంలో ఇచ్చిన ఆమోదాలను అధికారులు ఇకపై ప్రామాణికంగా పరిగణించరు. 8 CFR 214.1(c)(5) అనే చట్టపరమైన నిబంధనను తొలగించడం ద్వారా, ప్రతి రెన్యూవల్ దరఖాస్తును మొదటిసారి దరఖాస్తు చేసుకున్న దానిలాగే క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

ఈ మార్పు H-1B, L-1, O-1 వంటి వివిధ రకాల వర్క్ వీసాలకు వర్తిస్తుంది. ఏటా సుమారు 2,08,000 పిటిషన్లు ఈ కొత్త విధానం వల్ల ప్రభావితం కావచ్చని DHS అంచనా వేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, దరఖాస్తుదారులకు వీసా రెన్యూవల్ ప్రక్రియ మరింత కఠినంగా మారనుంది.

ఈ మార్పులపై ఇమ్మిగ్రేషన్ అటార్నీ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ ప్రతిపాదన వల్ల వీసా రెన్యూవల్ ప్రక్రియలో జాప్యం మరియు అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దరఖాస్తుదారులకు ఇది మరింత శ్రమతో కూడుకున్న ప్రక్రియగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, ఈ ప్రతిపాదనపై వలసదారులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లినాయిస్‌లో ఉంటున్న రితికా కుమారి అనే H-4 వీసా హోల్డర్ (ప్రధాన వీసా దారునిపై ఆధారపడి అమెరికాలో నివసించే కుటుంబ సభ్యులకు ఇచ్చే వీసా) ఈ మార్పుల వల్ల అర్హులైన వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.