అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లో ఆసియన్ అమెరికన్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ (AAROA) ఏర్పాటైంది. అక్టోబర్ 28న ఎడిసన్‌లోని మొఘల్ బాంకెట్ హాల్లో జరిగిన ఈ ప్రారంభ సభకు వంద మందికి పైగా రెస్టారెంట్ యజమానులు, ఫ్రాంచైజీ ఆపరేటర్లు హాజరయ్యారు. కేవలం రెండు వారాల్లోనే ఏర్పాటైన ఈ సదస్సులో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
ఆసియన్ అమెరికన్ రిటైలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిపిన్ పటేల్ ఈ కొత్త సంస్థ ఏర్పాటుకు నేతృత్వం వహించారు. బఫెలో వైల్డ్ వింగ్స్, డేవ్స్ హాట్ చికెన్, బ్లేజ్ పిజ్జా వంటి ఫ్రాంచైజీలతో ఆయనకు అనుభవం ఉంది. ఆయనతో పాటు కమల్ అరోరా, ఆనంద్ పటేల్, హేమంత్ చంపానేరియా, భావేశ్ పటేల్, దినేష్ గోస్వామి తదితర ప్రముఖులు ఈ సంస్థను ప్రారంభించారు.
రెస్టారెంట్ల నిర్వహణ గతంతో పోలిస్తే కష్టంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. కమర్షియల్ అద్దెలు, ఆస్తి పన్నులు, నిర్వహణ ఖర్చులు ఏడాదికి 5 నుండి 6 శాతం పెరుగుతున్నాయని చెప్పారు. ఇన్సూరెన్స్ ప్రీమియంలు రెండంకెల వృద్ధిని చూపిస్తున్నాయని, ఉద్యోగుల వేతనాలు మరియు లేబర్ నిబంధనల వల్ల ఆర్థిక భారం పెరుగుతోందని పేర్కొన్నారు.
సభ్యుల మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం, విధానపరమైన వాదనలు వినిపించడం, ఉమ్మడి కొనుగోళ్లు చేయడం వంటి అంశాలపై ఈ సంఘం దృష్టి పెట్టనుంది. ఈ సంస్థ ఎలాంటి సాంస్కృతిక లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనదని, కేవలం వ్యాపార సమస్యలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు.







