అక్కినేని అఖిల్ 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని తెచ్చిన 'లెనిన్' సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాతో అఖిల్ చివరకు సక్సెస్ అందుకున్నాడని రివ్యూ చెబతోంది. పక్కా కమర్షియల్ టెంప్లేట్‌లో సాగిన ఈ చిత్రంలో సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి.

కథ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లా శ్రీరామాపురంలో జరిగే ద్రౌపది అమ్మ జాతర నేపథ్యంలో 1976లో అనాథ అయిన లెనిన్ ఊరికి వస్తాడు. జయంతి (ఈశ్వరీరావు) అతడిని దత్తత తీసుకుని తన కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటు పెంచుతుంది. డాక్టర్ అయి తిరిగొచ్చిన వసంత్‌కు, ఊరిలోనే ఉండిపోయిన లెనిన్‌కు భారతి (భాగ్యశ్రీ బోర్సే)తో ప్రేమ విషయంలో ఏర్పడే సంఘర్షణే కథాంశం. మహాభారతం రిఫరెన్స్‌లు, యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి (సునీల్) పాత్రల చుట్టూ కథ నడుస్తుంది.

సినిమా మొదటి గంట రొటీన్‌గా సాగినా, తర్వాత వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మహాభారతం ఎలివేషన్స్, 'కూతురు కనిపించకపోతే కూతుర్ని వెతకాలి' లాంటి డైలాగ్స్ బాగా పడ్డాయి. అయితే, లెనిన్ జైలుకు వెళ్లిన కారణం సరిగా చూపించలేదు. విలన్ చాలా సులభంగా చనిపోవడం, తల నరకడం లాంటి సీన్స్ సున్నిత మనస్కులకు ఇబ్బంది కలిగించవచ్చు.

నటన పరంగా అఖిల్ తన గత సినిమాలపై ఉన్న ఫిర్యాదులను 'లెనిన్'తో అధిగమించాడు. ఫైట్స్, ఎమోషన్స్‌లో మెరుగుదల కనిపించింది. భాగ్యశ్రీ, ఈశ్వరీరావు, శివాజీ తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్టర్ మురళీ కిశోర్ కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు.