తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో విక్రమార్కుడు సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా ఒక మోసం జరిగింది. తాలూకా కార్యాలయ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, స్థానికురాలైన పళనియమ్మాళ్‌కు ఫోన్ చేశాడు. ఆ ప్రాంతంలో కొత్తరకం వ్యాధి వ్యాపిస్తోందని, విదేశాల్లో మహిళలు గుండు గీయించుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకున్నారని ఆమెను నమ్మించాడు.

ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, గుండు గీయించుకున్న మహిళలకు రూ. 15 వేలు, విద్యార్థినులకు రూ. 45 వేలు, పురుషులకు రూ. 6 వేలు ఇస్తామని ఆ వ్యక్తి మాయమాటలు చెప్పాడు. తన మాటలను నిజమని నమ్మించేందుకు నకిలీ ఫొటోలను, డబ్బు కట్టల చిత్రాలను వాట్సాప్‌లో పంపాడు. దీంతో పళనియమ్మాళ్‌తో పాటు మరికొందరు మహిళలు బార్బర్‌ను పిలిపించుకుని గుండు గీయించుకున్నారు.

డబ్బుల కోసం సదరు వ్యక్తికి ఫోన్ చేయగా, అతని మొబైల్ స్విచ్ఛాఫ్ అని రావడంతో మహిళలు కంగుతిన్నారు. వెంటనే అత్తూరు తాలూకా కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా, అలాంటి పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. ఈ మోసంతో సంబంధం ఉందన్న అనుమానంతో ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.