న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీ సెంచరీకి చేరువలో ఉండి ఉంటే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

మిడ్-డే కాలమ్‌లో గవాస్కర్ ఈ విషయాన్ని విశ్లేషించారు. ఒకవేళ కోహ్లీ 90 పరుగుల వద్ద ఉండి, జట్టు విజయానికి మరికొన్ని పరుగులు అవసరమైతే, గిల్ మరియు అయ్యర్ సందిగ్ధంలో పడేవారని ఆయన పేర్కొన్నారు. జట్టు గెలుపు కోసం ఆడాలా లేక కోహ్లీ సెంచరీ కోసం నెమ్మదిగా ఆడాలా అనే అయోమయం వారికి ఎదురయ్యేదని సన్నీ వివరించారు.

అయితే కోహ్లీ 74 పరుగులకే ఔట్ కావడంతో అలాంటి పరిస్థితి తలెత్తలేదని గవాస్కర్ చెప్పారు. జట్టు విజయం ఎప్పుడూ ప్రాధాన్యమేనని, కానీ ఒక ఆటగాడు వ్యక్తిగత మైలురాయిని చేరుకోవడం కూడా అభిమానులకు గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. కోహ్లీ 100 సెంచరీల ఘనతను అందుకునే అవకాశం వచ్చినప్పుడు, తోటి ఆటగాళ్లు పరుగులను త్యాగం చేసి అతడికి సహకరించాలని గవాస్కర్ సూచించారు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ 86 సెంచరీలు సాధించాడు. 100 సెంచరీల మైలురాయిని అందుకోవడానికి అతనికి ఇంకా 14 శతకాలు అవసరం. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే.

కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న నేపథ్యంలో, 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత అతను కొనసాగుతాడో లేదో తెలియదు. ఈ అరుదైన ఘనతను కోహ్లీ ఎప్పుడు అందుకుంటాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. జట్టు విజయావకాశాలను దెబ్బతీయకుండా ఈ మైలురాయిని చేరుకోవడం ముఖ్యమని గవాస్కర్ తన విశ్లేషణలో పేర్కొన్నారు.