కేరళ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటివరకు 8 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పాటు రహదారులు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 27 ఇండ్లు పూర్తిగా, 196 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా, మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం వీడీ సతీషన్ సూచించారు. అధికారులు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల నుంచి 5,792 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి 209 పునరావాస కేంద్రాల్లో ఉంచారు. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (KSDMA) సిబ్బందితో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పారిశుద్ధ్య పనులతో పాటు శిథిలాల తొలగింపును అధికారులు వేగవంతం చేశారు.

రాష్ట్రంలోని 12 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 115 మిల్లీమీటర్ల నుంచి 204 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వరదల వల్ల వ్యాపించే అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆరోగ్యశాఖ మంత్రి మురళీధరన్ తెలిపారు. పాడైన రోడ్ల మరమ్మతులను రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.