వికారాబాద్ జిల్లా తాండూరులో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాత్విక్ (15) అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. స్కూటీపై ఉన్న శేఖర్, గోవర్ధన్ అనే మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడటంతో, వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

వీరు గొట్లపల్లి మోడల్ స్కూల్‌లో ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఎన్టీఆర్ కాలనీకి చెందిన సాత్విక్, తన స్నేహితులను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తుండగా అంతారం బైపాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో వాకింగ్‌కు వెళ్లి వస్తున్న బట్టే శ్రీరాములు (82) అనే వృద్ధుడిని ప్రైవేట్ కంపెనీ బస్సు ఢీకొట్టింది. శ్రీ రమణ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన బయోలాజికల్ కంపెనీ బస్సు అతడిని బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీరాములును గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని అంబర్‌పేట్ సీఐ టి.కిరణ్ కుమార్ తెలిపారు.

మాదాపూర్‌లో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో పోలవరపు తేజస్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాకు చెందిన తేజస్, కొండాపూర్‌లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి తన స్నేహితుడు మోహిత్‌తో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వెళ్తుండగా, వేగంగా ఉండటంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తేజస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌పై ఉన్న మోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.