అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డాలస్‌లో జరిగిన ఒక సదస్సులో ఈ హామీని ప్రకటించారు. నవంబర్‌లో జరగనున్న ప్రతినిధుల సభ, సెనేట్ ఉప ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. ఈ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు భావించి రిపబ్లికన్లను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

దేశం ఆర్థికంగా బాగా రాణిస్తోందని, ఎక్కువ డబ్బు సంపాదిస్తోందని ట్రంప్ చెప్పారు. అందుకే ఈ నగదు పంపిణీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విజయవంతమైన కంపెనీలు తమ వాటాదారులకు లాభాలను పంచే విధానాన్ని పోలి ఉంటుందని, అందుకే దీనిని 'డివిడెండ్' అని పిలుస్తామని ఆయన వివరించారు.

ఈ నగదును అమెరికాలోనే తప్పనిసరిగా ఖర్చు చేయాలనేది ఈ పథకంపై ఉన్న ఏకైక షరతు. అయితే, ఈ హామీని ఏ విధంగా అమలు చేస్తారనే దానిపై ట్రంప్ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కేవలం రిపబ్లికన్లు గెలిస్తే మీరూ గెలిచినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపుపై కూడా ట్రంప్ స్పందించారు. నవంబర్ ఎన్నికల తర్వాత ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఇక ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించలేదని ఆయన పేర్కొన్నారు.

అయితే, ట్రంప్ సన్నిహితులు ఇద్దరు దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు అంటే మరో రెండేళ్ల పాటు ఈ యుద్ధం కొనసాగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.