కాకినాడలోని ఎస్.కె. కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో శనివారం జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థిని తలకు గాయమైంది. ఆమెను చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక విద్యార్థి మొబైల్ ఫోన్ దొంగతనానికి గురికావడంతో, ఆ విద్యార్థులు సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విషయం తెలుసుకున్న స్థానిక విద్యార్థులు, ఈశాన్య ప్రాంత విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది.

ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, పరిస్థితిని సమీక్షించి సీనియర్ అధికారులను రంగంలోకి దింపారు. సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రిర ప్రసాద్, ఎస్పీ (జిల్లా పోలీసు అధికారి) జి. బిందు మాధవ్ వెంటనే క్యాంపస్‌కు అధికారుల బృందాన్ని పంపించారు.

ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల భద్రతపై మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నాం ఖేమ్‌చంద్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు, విద్యార్థుల రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మరింత ఉద్రిక్తత తలెత్తకుండా అడ్డుకోవడంతో పాటు, మణిపూర్, నాగాలాండ్‌కు చెందిన 31 మంది విద్యార్థులకు వేర్వేరు వసతి కల్పించారు.

ప్రస్తుతం క్యాంపస్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అధికారుల స్పందనపై ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారని, సమస్య స్నేహపూర్వకంగా పరిష్కారమైందని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.