హరారే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సహచర ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఎదురైన పరాజయాలను విస్మరించి, మైదానంలో ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలని సూచించాడు. గత పర్యటనల నుంచి జట్టుగా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని, పరిస్థితులకు అనుగుణంగా మారడంపై స్పష్టత వచ్చిందని ఆయన పేర్కొన్నాడు.

జింబాబ్వే పరిస్థితులకు ఎంత వేగంగా అలవాటుపడితే అంత మెరుగైన ఫలితాలు వస్తాయని అయ్యర్ అభిప్రాయపడ్డాడు. బయట వచ్చే విమర్శలను పట్టించుకోకుండా కేవలం ఆటపైనే దృష్టి సారించాలని జట్టు సభ్యులకు సూచించాడు. ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయడం లేదని, జింబాబ్వే జట్టులో ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా ఉన్నారని ఆయన గుర్తుచేశాడు.

యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుతూ, నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడని, తన తప్పులను సరిదిద్దుకున్నాడని అయ్యర్ తెలిపాడు. అందుకే అతడికి ప్రత్యేకంగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, మైదానంలో వైభవ్ కచ్చితంగా చెలరేగుతాడని నమ్మకం వ్యక్తం చేశాడు. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్‌ను ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది.